లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 March 2024 4:15 PM GMTలిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ముందుగా ఆయన ఇంట్లో సోదాలు చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్‌తో వెళ్లిన అధికారులు.. కేజ్రీవాల్‌ను పలు ప్రశ్నలు అడిగి అదుపులోకి తీసుకున్నారు.
సీఎం కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు, అరెస్ట్‌తో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈడీ అధికారుల వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు కేజ్రీవాల్ నివాసానికి వస్తుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో.. కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం కనిపించింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయినా కూడా ఆయనే సీఎంగా కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతిషీ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే విచారణకు రావాలంటూ ఈడీ కేజ్రీవాల్‌కు పలుమార్లు నోటీసులు పంపింది. కానీ.. హాజరయ్యేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. దాంతో.. ఈడీ గురువారం నేరుగా కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి సోదాలు చేసింది. మరోవైపు ఇదే కేసులో హైకోర్టులో గురువారం షాక్ ఎదురైంది. అరెస్ట్ నుంచి మినహాయింపు విషయంలో హైకోర్టు నిరాకరించింది. అన్ని ప్రతికూల వాతావరణం మధ్య ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు జరిపి ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.