ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు కష్టకాలంలో అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు నెలలపాటు ప్రతి నెలా రూ.5,000 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తమ వంతుగా ఈ ఆర్థిక సహాయం చేస్తున్నామని ప్రకటించింది. దీనితో పాటూ రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులను ఉచితంగా పంపిణీ చేయనుంది.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఆటో రిక్షాలు, ట్యాక్సీల డ్రైవర్లందరికీ నెలకు రూ.5,000 చొప్పున రెండు నెలలపాటు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఈ ఆర్థిక సంక్షోభం సమయంలో పేదలకు చేదోడువాదోడుగా ఉండాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అదేవిధంగా ఢిల్లీలోని 72 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ సరుకులను రెండు నెలలపాటు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలా అని ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ రెండు నెలలపాటు కొనసాగుతుందని భావించవద్దని కేజ్రీవాల్ ప్రజలను కోరారు. పరిస్థితి మెరుగుపడుతుందని, లాక్‌డౌన్ అవసరం ఉండదని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

కోవిడ్ -19 మొదటి వేవ్ సమయంలో కూడా ఢిల్లీ ప్రభుత్వం 1.56 లక్షల రూపాయలు ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించిందని, అలాగే ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులను సైతం ఆదుకుందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రజలను రాజకీయ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా ఆదుకోవాలని ఇతర పార్టీలకు పిలుపునిచ్చారు.సామ్రాట్

Next Story