రైతులకు గుడ్‌న్యూస్..ఈ బడ్జెట్‌లోనే పీఎం కిసాన్ రూ.8వేలకు పెంపు?
కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 23 July 2024 8:45 AM ISTరైతులకు గుడ్‌న్యూస్..ఈ బడ్జెట్‌లోనే పీఎం కిసాన్ రూ.8వేలకు పెంపు?
కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఇటీవల కూటమి పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే.. తొలి పూర్తిస్తాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందర్లోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు వరుసగా ఏడోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. తద్వారా ఆమె రికార్డును అందుకోబోతున్నారు. మొరార్జీ దేశాయ్‌ను అధిగమించబోతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకు ముందే నిర్మలా సీతారామన్ పలు రంగాల అధికారులతో సమావేశం అయ్యారు. రైతు సంఘాలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. దాంతో.. పీఎం కిసాన్ నిధి పెంపుపై ఈ బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
రైతు సంఘాల నాయకులు కూడా ఆయా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని పీఎం కిసాన్ నిధులు పెంచాలని డిమాండ్ వినిపించారు. రైతుల పంట సాయం అందించేందుకు 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఏడాదికి మూడు దఫాలుగా మొత్తం రూ.6వేలు జమ చేస్తోంది. ఈ డబ్బుల్ని నేరుగా రైతుల అకౌంట్లలోనే జమచేస్తుంది. దీన్నే రైతు సంఘాలు రూ.8వేలుకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనే ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రైతులకు కేంద్రం శుభవార్త చెప్పబోతుందని తెలుస్తోంది. మరోవైపు పలు కీలక పంటల కనీసం మద్ధతు ధర కూడా పెంచాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.
కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 17 విడుతలుగా డబ్బు జమ చేసింది. చివరి విడత కింద కేంద్రం మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20వేల కోట్లను జమ చేశారు. సెప్టెంబర్‌లో 18వ విడుత డబ్బులు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి పెంచిన మొత్తంలో డబ్బులు జమ అవుతాయని పలువురు చెబుతున్నారు.