జూలై 3న కేంద్ర కేబినెట్ భేటి, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన జూలై 3న కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.
By Srikanth Gundamalla
జూలై 3న కేంద్ర కేబినెట్ భేటి, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ!
కేంద్రమంత్రి వర్గ విస్తరణపై వార్తలు జోరందుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జూలై 3న కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదనాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేంద్రమంత్రులు, సహాయ, స్వతంత్ర మంత్రులంతా హాజరుకానున్నారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపత్యంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ గురించి కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇక జూలై మూడోవారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో కొద్దిరోజుల ముందే కేంద్రకేబినెట్ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 28న ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ అగ్రనేతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. కేంద్రకేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై హోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర నేతలతో ప్రధాని మోదీ జూన్ 28న చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేవ్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చేఏడాదే లోక్‌సబ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాలతో పాటు... కేంద్రంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ సన్నద్ధం అవుతోంది. రాష్ట్ర సథాయిలో పార్టీలో సంస్థాగత మార్పులపైనా కూడా ప్రధాని చర్చించినట్లు సమాచారం. వరుస సమావేశాలను చూస్తే బీజేపీ సార్వత్రిక ఎన్నికలతో పాటు.. ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది.