కొచ్చి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం.. భోపాల్‌లో ల్యాండింగ్
కొచ్చిన్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానాన్ని భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 10:16 AM ISTకొచ్చిన్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానాన్ని భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే ఈ విధంగా చేసినట్లు ఇండిగో విమాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన 6E 2407 విమానం కొచ్చిన్ నుంచి ఢిల్లీకి బయలు దేరింది. కొద్ది సేపటి తరువాత విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడి ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్ని విమాన సిబ్బంది ఫైలట్లకు తెలుపగా.. వారు విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే విమానాన్ని భోపాల్‌కు దారి మళ్లించారు. విమానం ల్యాండింగ్ కాగానే ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయకుండా అప్పటికే సిద్దంగా ఉన్న ఎయిర్ పోర్టు సిబ్బంది సదరు ప్రయాణికుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కాగా.. ఈ ఘటన కారణంగా ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. "కొచ్చిన్ నుండి ఢిల్లీకి నడిచే ఇండిగో ఫ్లైట్ 6E 2407 విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా భోపాల్‌కు మళ్లించబడింది. ఇతర ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము." అని ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉంటే..శుక్రవారం ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. 176 మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బందితో కాలికట్ విమానాశ్రయం నుంచి దమ్మామ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో తోక భాగం రన్‌వేను ఢీ కొట్టింది. అప్రమత్తమైన ఫైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎవ్వరికి ఏమీకాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.