శనివారం పాట్నాలోని నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఓ వ్యక్తి మరణించిన కొద్ది గంటలకే అతని కన్ను తప్పిపోయింది. ఈ కేసులో వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఫంటుష్ అనే వ్యక్తి కుటుంబం ఆసుపత్రి ఆవరణలో నిరసనకు దిగింది. అయితే అతని కంటిని ఎలుక కొరికిందని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 14న గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపడంతో ఫంటుష్ ఆసుపత్రిలో చేరాడు. నవంబర్ 15న అతనికి శస్త్ర చికిత్స చేసి ఐసీయూకి తరలించారు. ఫంటుష్ శుక్రవారం రాత్రి మరణించాడు. అయితే రాత్రికి పోస్ట్‌మార్టం నిర్వహించలేని కారణంగా అతని మృతదేహాన్ని ఐసియు బెడ్‌పై ఉంచారు.
శనివారం ఉదయం అతని కుటుంబ సభ్యులు అతని ఎడమ కన్ను మిస్ అయ్యిందని, వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించారు. బంధువు టేబుల్ దగ్గర సర్జికల్ బ్లేడ్ కనుగొనబడిందని పేర్కొన్నారు. నలంద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేసును విచారించేందుకు నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. "ఎవరైనా కన్ను తీశారా? లేదా ఎలుక కన్ను కొరికిందా?.. తెలియదు. ఈ రెండు సందర్భాల్లోనూ తప్పు మాదే.. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.