సమోసాలో చనిపోయిన బల్లి.. తిన్న తండ్రి, కూతురికి అస్వస్థత
చనిపోయిన బల్లి ఉన్న సమోసాను తిని ఒక వ్యక్తి , అతని కుమార్తె అస్వస్థతకు గురైనట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
By అంజి Published on 17 Nov 2023 2:39 AM GMTసమోసాలో చనిపోయిన బల్లి.. తిన్న తండ్రి, కూతురికి అస్వస్థత
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో సమోసా తింటుండగా తండ్రీకూతుళ్లకు భయంకరమైన అనుభవం ఎదురైంది. సమోసాలో చనిపోయిన బల్లి కనిపించడం కలకలం రేపింది. సమోసాను తిని ఒక వ్యక్తి, అతని కుమార్తె అస్వస్థతకు గురైనట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి. హాపూర్ జిల్లా పిల్ఖువా ప్రాంతంలోని ఓ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. న్యూ ఆర్య నగర్‌లో నివాసం ఉంటున్న మనోజ్ కుమార్ కుమారుడు అజయ్ బుధవారం మొహల్లా కిషన్‌గంజ్‌లోని ఓ దుకాణం నుంచి ఐదు సమోసాలను కొనుగోలు చేసినట్లు అధికారి తెలిపారు.
కుమార్ కూతురు ఇంట్లో సమోసా తినడం ప్రారంభించగా.. అందులో బల్లి ఉండడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారని మనోజ్ కుమార్ తెలిపారు. అప్పటికే మనోజ్ కుమార్ ఒక సమోసాను తిన్నాడు. కొంత సమయం తర్వాత కుమార్, అతని కుమార్తె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. కూతురు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. సమోసాలో బల్లి కనిపించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీంతో బాధిత కుటుంబం ఆహార శాఖకు కూడా సమాచారం అందించింది. సమాచారం అందుకున్న ఫుడ్ ఆఫీసర్ ఓం ప్రకాష్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని అస్వస్థతకు గల కారణాలను తెలుసుకున్నారు. మొత్తం కేసును విచారిస్తున్నట్లు ఓం ప్రకాష్ తెలిపారు. నమూనాను ల్యాబొరేటరీకి పంపామని, నమూనా నివేదికల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొన్ని రోజుల క్రితం ధౌలానా ప్రాంతంలో ఓ బిర్యానీలో బల్లి కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడాది సెప్టెంబరులో జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాలోని ఒక పాఠశాలలో ఆహారంలో బల్లి కారణంగా ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన వందమందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని పేర్కొనడం గమనార్హం.