తూర్పు లడఖ్‌లో రెండు సైన్యాల మధ్య ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చైనా ధ్రువీకరించింది. ఇటీవలి కాలంలో భారత్-చైనా దేశాల మధ్య చర్చలు జరిగాయని, చైనా-భారత్ సరిహద్దులో నెలకొన్న సమస్యలపై చర్చించామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. ప్రస్తుతం ఎల్ఏసీ వద్ద ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని, తాజా ప్రతిపాదనను అమలు చేసేందుకు చైనా ఇండియాతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి పెట్రోలింగ్‌పై చైనాతో ఒప్పందం కుదిరిందని భారత్ సోమవారమే ప్రకటించింది. రెండు సైన్యాల మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలకడంలో ప్రధాన పురోగతి సాధించినట్లు భారత ప్రభుత్వం కూడా తెలిపింది. జూన్ 2020లో గాల్వాన్ లోయలో భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా తగ్గాయి. భారత సైన్యం చైనాపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోందని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. చైనా భారత్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, భారత్ చెప్పిన బఫర్ జోన్‌లలోకి ప్రవేశించకూడదని చైనాకు సూచించారు. బీజింగ్‌తో సైనిక సంబంధాలను ఏప్రిల్ 2020కి ముందు స్థాయికి తిరిగి తీసుకురావడమే లక్ష్యమని ఆర్మీ చీఫ్ చెప్పారు.