తీరం దాటుతూ కూడా బీభత్సం సృష్టిస్తున్న యాస్ తుఫాను

Cyclone Yaas. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్రరూపం దాల్చింది.

By Medi Samrat  Published on  26 May 2021 5:17 PM IST
Cyclone Yaas

రాకాసి తుఫాన్ యాస్ తీర ప్రాంతాల్లో అల్ల కల్లోలం సృష్టిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్రరూపం దాల్చింది. మధ్యాహ్నం తర్వాత బాలాసోర్- ధమ్ర పోర్ట్ మధ్య తీరం దాటింది. దీంతో పోర్ట్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. అటు ఒరిస్సా, బెంగాల్ తీరంపై విరుచుకుపడుతుండటంతో అక్కడ 9 వ నెంబర్ హేచ్చరిక జారీ చేశారు. తీరం దాటే సమయంలోనూ ఇది అతి తీవ్ర తుఫాన్‌గానే ఉంటడం వల్ల గంటకు 130 నుండి 140 కిలో మీటర్ల వేగంతో.. ఒక్కోసారి 155 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

ముఖ్యగా దీని ప్రభావం ఉత్తర ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ పైన ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు.. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను దెబ్బకు సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని చోట్ల సముద్రం నీరు నివాసప్రాంతాల్లోకి వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ లోని న్యూ దిఘా బీచ్ వెంబడి సముద్రం నుంచి నీరు నివాస ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి. రాకాసి అలలు పెద్ద ఎత్తున ఉగ్రరూపంతో దూసుకువస్తున్నాయి. అంతేకాకుండా ఒడిషా ప్రాంతాల్లో ఈదురు గాలులతో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుఫాన్ దెబ్బకి బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయ్. యాస్ బెంగాల్, ఒడిశాల మధ్యే తీరం దాటనుండటంతో.. ఆ రెండు రాష్ట్రాలకే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని ముందునుంచే అంచనాలు వేసారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మొత్తం ఐదు రాష్ట్రాల్లో 115 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సంతో నివాసిత ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అధికారులు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా తుఫాన్ ప్రభావాన్ని బట్టి అధికారులు చర్యలకు సిద్ధంగా ఉన్నారు. ఇక బీహార్, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఈ సాయంత్రానికి తుఫాను తాకవచ్చునని, ఫలితంగా ఇక్కడ కూడా ఒక మోస్తరు నుంచి భారీ లేదా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.




Next Story