తౌక్టే తుపాను ఎఫెక్ట్.. కేర‌ళ అతలాకుత‌లం.. స్తంభించిన జ‌న‌జీవ‌నం

Cyclone tauktae updates in kerala.అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తౌక్టే తుఫానుగా మారింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 May 2021 8:45 AM IST
tauktae cyclone

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తౌక్టే తుఫానుగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాను గోవాకు 222 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను ప్ర‌భావం కార‌ణంగా ఈదురుగాలులు వీచి, అతి భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో శ‌నివారం కేర‌ళ అతలాకుతమైంది. వాతావ‌ర‌ణ విభాగం కేరళలోని 9 జిల్లాల్లో రెడ్ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. ఉత్త‌ర జిల్లాలైన మ‌ల్లాపురం, కొళికొడ్‌, వ‌య‌నాడ్‌, కన్నూర్‌, కాస‌ర్‌గోడ‌ల్లో తీవ్ర‌త అధికంగా ఉంది. అలాగే, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిస్సూరు, పాలక్కాడ్ జిల్లాల్లోనూ దీని ప్రభావం కనిపించింది.

తీర ప్రాంతాల‌లో స‌ముద్రం ఆక‌స్మికంగా ముందుకు రావ‌డంతో జ‌నజీవ‌నం స్తంభించింది. వంద‌లాది ఇళ్లు దెబ్బ‌తిన‌గా.. చెట్లు విరిగిపోవ‌డంతో చాలా ప్రాంతాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఇక ప్ర‌ధాన న‌దులైన మీనాచిల్‌, అచ‌న్‌కోవిల్‌, మ‌ణియాల‌ల్లో నీటి ప్ర‌వాహాం పెరుగుతోంది. దీంతో వాటి ఆన‌కట్ట గేట్ల‌ను ఎత్తివేశారు. కాసర్‌గోడ్‌ జిల్లాలోని చేరంగాయ్‌లో తుపాను దాటికి ఓ భవనం కుప్పకూలింది. అయితే, అందులో నివసించే కుటుంబాలను ముందుగానే ఖాళీ చేయించడంతో పెను ముప్పు తప్పింది.

ఇక తీవ్ర‌మైన తౌక్టే తుఫాను గుజ‌రాత్ వైపు ప‌య‌నిస్తోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఇది అత్యంత తీవ్ర‌మైన తుఫానుగా మారుతుంద‌ని తెలిపింది. ఈనెల 18న గుజరాత్ లోని పోర్ బందర్, నలియా మధ్య మ‌ధ్యాహ్నాం 2.30 నుంచి రాత్రి 8.30గంట‌ల మ‌ధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. దీంతో గుజరాత్ లోని 15 జిల్లాలను అప్రమత్తం చేశారు. అత్యవసరస సహాయక బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిప్రభావం అటు మహారాష్ట్ర, గోవాలపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొన్నది.




Next Story