కర్ణాటక, గోవాలో 'తౌక్టే' భీభ‌త్సం..

Cyclone Tauktae Hits Karnataka And GOA.తౌక్టే తుపాన్‌ ప్రభావంతో కేరళ, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 May 2021 1:41 PM IST
Cyclone Tauktae

తౌక్టే తుపాన్‌ ఉగ్రరూపం దాల్చి ప‌లు రాష్ట్రాల‌పై విరుచుకుప‌డుతోంది. ఈ తుఫాను గుజ‌రాత్ దిశ‌గా క‌దులుతోంది. ఈ నెల 18న గుజ‌రాత్ రాష్ట్రంలోని పోర్‌బంద‌ర్‌-మ‌హువా మ‌ధ్య తీరం దాట‌నుంది. ప్రస్తుతం ఈ తుపాన్‌ గోవాకు 150 కిలోమీటర్ల వాయువ్య దిశలో, ముంబయికి 490 కిలోమీటర్ల దూరంలో, గుజరాత్‌కు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాన్‌ ప్రభావంతో కేరళ, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. కర్ణాటక, గోవాలు ఈ తుపాన్‌ ధాటికి అతలాకుతలమయ్యాయి. అక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

తుఫానుకు 73 గ్రామాలు ప్రభావితమయ్యాయని, ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్‌డీఎంఏ) ఆదివారం తెలిపింది. సహాయక చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. మ‌రోవైపు గోవా తీర ప్రాంతాలు, రాజధాని పనాజీని తుఫాను తాకింది. తుఫాన్ కార‌ణంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వ‌ర్షాలు, ఈదురు గాలుల కార‌ణంగా.. ఓ కోవిడ్‌ ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. బ్యాక్‌ పవర్‌ సప్లైతో ప్రస్తుతం ఆసుపత్రి నడుస్తోంది. తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు 100 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు ఓ అధికారి తెలిపారు.




Next Story