స్ట్రెయిన్‌ని అడ్డుకొనేందుకు భారత్ లో కర్ఫ్యూ.. ?
Curfew In India. స్ట్రెయిన్‌ని అడ్డుకొనేందుకు భారత్ లో రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించ వచ్చు అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేసింది.
By Medi Samrat Published on 1 Jan 2021 5:58 PM ISTగత కొద్ది రోజులు క్రితం కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలందరినీ కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ లాక్ డౌన్ అమలు చేయడం వల్ల వీలైనంతవరకు కరోనాను కట్టడి చేయవచ్చు అనే ఆలోచనలోనే భాగంగా లాక్ డౌన్ విధించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో దశలవారీగా కరోనా నిబంధనలను తొలగిస్తూ వచ్చారు. అయితే దేశంలో ప్రస్తుత కరోనా కేసులు తగ్గినప్పటికీ బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కొత్తగా స్ట్రెయిన్ వైరస్ బయటపడడంతో ఒక్కసారిగా దేశ ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే కరోనా వైరస్ తో సతమతమవుతున్న దేశ ప్రజలందరికీ మరో కొత్త వైరస్ వ్యాపించడంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ కొత్త వైరస్ దేశ ప్రజలందరికీ వ్యాపించకుండా ముందుగానే కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగానే బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అంతేకాకుండా ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చే విమానాల రాకపోకలను కూడా నిలిపివేశారు. స్ట్రెయిన్ వైరస్‌ను అడ్డుకొనే చర్యలలో భాగంగా అవసరమైతే రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించు కోవచ్చని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
పగలు సమయాలలో ఎక్కువగా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని, మార్కెట్లు నిర్దేశిత సమయం పనిచేసేలా చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను మేరకు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా బహిరంగంగా మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి తగిన జరిమానా విధించవచ్చు. విద్యా, సాంస్కృతిక, మతసంబంధ కార్యక్రమాలలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలి. మార్కెట్ తదితర ప్రాంతాలలో ప్రజలు గుంపులుగా ఉండకుండా నిర్దేశిత విధానాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాలను జారీ చేశారు.