కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని, టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇటీవల తనకు దగ్గరగా వచ్చిన ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలాగే సురక్షితంగా ఉండాలని చెప్పారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం వచ్చిన నేపథ్యంలో ఆయనను నిన్న ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షల్లో 88 ఏళ్ల మన్మోహన్ కు పాజిటివ్ అని తేలింది. మన్మోహన్ ఇప్పటికే రెండు కరోనా డోసులు వేయించుకున్నారు. మన్మోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనూ కరోనా కలకలం రేగింది. కేజ్రీవాల్ భార్య సునీతకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. భార్యకు కరోనా సోకడంతో కేజ్రీవాల్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఢిల్లీలో బెడ్లు దొరకడంలేదని రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం అదనపు బెడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఢిల్లీలో ఇప్పటికే ఆరు రోజుల పాటూ లాక్ డౌన్ ను ప్రకటించారు.