దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దాదాపు అన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఓ వైపు కరోనా మహమ్మారి కబలిస్తుంటే.. మరోవైపు ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు చనిపోతున్నారు. రీసెంట్ గా కర్ణాటకలో ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది కరోనా రోగులు మృతి చెందిన ఘటనను మరువక ముందే.. తాజాగా తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది.
ఆక్సిజన్ అందక చెంగల్ పట్టు ప్రభుత్వాసుపత్రిలో 11 మంది కరోనా రోగులు మరణించారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులను అధికారులు ఇతర ఆస్పత్రులకు తరలించారు.డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారంటూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు.చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడ లోపం తలెత్తిందనే విషయం తెలియాల్సి ఉంది.
ఇలాంటి ఘటనే కర్ణాటకలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్నది. కర్ణాటలోని చామరాజనగర్‌లో ఉన్న జిల్లా దవాఖానలో సోమవారం తెల్లవారుజామున ఆక్సిజన్ అందకపోవడంతో 2 గంటల్లో 24 మంది రోగులు మృతి చెందారు. వీరిలో కొందరు కోవిడ్ పేషంట్లు కూడా ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 2 గంటల మధ్య వారు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.