ఇప్పుడేముంది.. రాబోయే రోజుల్లో మహమ్మారి మరింతగా..!
Covid-19 second wave india may peak mid april.దేశంలో కరోనా కేసుల సంఖ్య ఏప్రిల్ నెల మధ్యలోనే శిఖర స్థాయికి చేరొచ్చని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు.
By తోట వంశీ కుమార్ Published on 5 April 2021 4:52 PM ISTభారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై 14 నెలలు కావొస్తున్నా.. ఈ స్థాయిలో కొత్త కేసులు ఎన్నడూ నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో 1,03,558 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 1,25,89,067కి చేరాయి. నిన్న ఒక్క రోజే 478 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,65,101కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 52,847 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు 1,16,82,136 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,41,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాబోయే రోజుల్లో కరోనా మరింతగా విజృంభించబోతోందట.. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఏప్రిల్ నెల మధ్యలోనే శిఖర స్థాయికి చేరొచ్చని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత మే నెల చివరికల్లా ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని గణితశాస్త్ర నమూనాల ఆధారంగా లెక్కలు వేస్తున్నారు. 'సూత్రా' అనే గణితశాస్త్ర మోడల్.. కరోనా తొలిదశ టైమ్ లోనూ ఇలాగే కచ్చితమైన అంచనాలు వెలువరించింది. అప్పట్లో 'సూత్రా' ప్రకారం కరోనా కేసులు ఆగస్టులో ఎక్కువ కావడం మొదలుపెట్టి సెప్టెంబర్ నాటికి శిఖర స్థాయికి చేరి ఆ తర్వాత తగ్గుతూ 2021 ఫిబ్రవరికి అత్యల్ప స్థాయికి చేరుతాయన్నారు.. అచ్చం అలాగే జరిగింది.
ఇప్పుడు కూడా వారి అంచనా నిజమవుతుందేమోనని అంటున్నారు. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన మణింద్ర అగర్వాల్ తో పాటూ మరికొందరు ఈ సూత్రా ఆధారంగా కరోనా కేసులపై అంచనా వేశారు. దాని ప్రకారం ఏప్రిల్ మధ్యకల్లా అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని తేలింది. దేశంలో రోజువారీగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ప్రస్తుతానికి మహారాష్ట్ర నిలవగా.. మరికొన్ని రోజుల్లో పంజాబ్‌లోనూ కేసుల సంఖ్య గణనీయంగా ఎక్కువ అవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు.