ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులు అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ కు కోర్టు మరో 5 రోజుల ఈడీ కస్టడీ పొడిగించింది. వీరిద్దరి కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు శనివారం రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కుంభకోణంలోని ముడుపులుగా చెల్లించిన 100 కోట్ల రూపాయలను సరఫరా చేయడంలో అభిషేక్ బోయినపల్లి కీలక పాత్ర పోషించారని.. ఆయన్ను మరింత విచారించేందుకు వీలుగా మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు.
హవాలా మార్గంలో 30 కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపించడం, మిగిలిన మొత్తాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడంలో అభిషేక్ బోయినపల్లిదే కీలక పాత్రధారి అని ఆ విషయాలన్నింటినీ రాబట్టే పనిలోనే భాగంగా చందన్ రెడ్డి, బుచ్చి బాబులను సైతం ప్రశ్నిస్తున్నట్లుగా ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా అభిషేక్, విజయ్ నాయర్‌ల తరపు న్యాయవాది వాదిస్తూ అన్ని స్టేట్మెంట్‌లను రికార్డ్ చేసుకున్నారని వాదించారు. ఇప్పటి వరకు ఎలాంటి రికవరీ జరగలేదని అందువల్ల తదుపరి కస్టడీ కొనసాగించాల్సిన అవసరం లేదని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లకు మరో ఐదు రోజుల కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చారు.