ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నమోదు చేసిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు మంగళవారం ఆగస్టు 27 వరకు పొడిగించింది. కేజ్రీవాల్ కస్టడీ గడువు నేటితో ముగియడంతో తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు ఆయనను హాజరుపరిచారు.
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. కేజ్రీవాల్ అరెస్టును కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై.. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. మేం ఎలాంటి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం లేదని కేజ్రీవాల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి ధర్మాసనం తెలిపింది. నోటీసు జారీ చేస్తామని పేర్కొంది. ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. విచారణ సమయంలో సీబీఐ తరఫు నుంచి ఎవరూ కోర్టుకు హాజరు కాలేదు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో సీబీఐ అరెస్టును కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ను కోరారు. ఆగస్టు 23లోగా సీబీఐకి సమాధానం చెప్పాలని కోరిన సుప్రీంకోర్టు.. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది.