మాస్క్ పెట్టుకోమంటే పోలీసులందరినీ మటాష్ చేస్తానన్న మహిళ.. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Couple Seen Arguing With Delhi Police For Not Wearing Masks Amid COVID. భారతదేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా

By Medi Samrat
Published on : 19 April 2021 4:40 PM IST

couple arguing

భారతదేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! తప్పకుండా ప్రతి ఒక్కరూ మాస్కు పెట్టుకోవాలని అధికారులు చెప్తున్నారు. కారుల్లో వెళ్తున్నా కూడా మాస్కు తప్పనిసరి అని చెబుతున్నారు. అయితే ఓ మహిళకు చెందిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. మాస్కు పెట్టుకోవాలన్న పోలీసుల మీదకు ఆమె అంతెత్తున లేచింది. ఈ వీడియోను వైరల్ చేస్తారేమో చేసుకోండి.. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరి దగ్గరకు వెళ్లినా భయపడను అని ఆమె పోలీసులతో నడిరోడ్డు మీదనే గొడవ పెట్టేసుకుంది. దీంతో నోరు తెరచి చూడడం పోలీసుల వంతైంది.

ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలో వారాంతపు లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే..! ఆ సమయంలో పోలీసులు పలు ప్రాంతాల్లో నాకాబందీ పెట్టారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి ఫైన్స్ కూడా వేశారు. ఇంతలో ఓ జంట కారులో షికార్లు కొడుతూ పోలీసులకు కనిపించింది. మాస్కు పెట్టుకోవాలని పోలీసులు సూచించారు. తాము మాస్కు పెట్టుకోమని.. ఇద్దరూ కారులో తిరుగుతూ ఉన్నామని.. తమతో ఎవరూ లేరు.. భార్యాభర్తలమని చెప్పుకొచ్చింది. పోలీసులు ఫైన్ రాయాలి కారును పక్కకు తీయమని అడిగినప్పటికీ వారు అక్కడి నుండి వెళ్లిపోవాలని చూసారు. అయినా పోలీసులు వదలకపోవడంతో కిందకు దిగిన ఆ వనిత పోలీసులను, ప్రభుత్వాలను తిట్టడం మొదలు పెట్టింది.

నాకు మాస్క్‌ లేదు.. అయితే నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. నన్ను ఆపగలవా అంటూ పోలీసులనే ఎదురు ప్రశ్నించింది. ఆమె భర్త కూడా నా కారు ఎందుకు ఆపావు అంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. విధుల్లో పోలీసులతో దురుసుగా మాట్లాడినందుకు ఆ జంటపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేను యూపీఎస్సీ కూడా క్లియర్ చేశాను అని పోలీసులతో ఆ మహిళ చెప్పగా.. యూపీఎస్సీ క్లియర్ చేసిన మీరు మరింత బాధ్యతగా ఉండాలని పోలీసులు చెప్పారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.. ఆమె భర్తను కస్టడీలోకి తీసుకున్నారు.



Next Story