అర్ధరాత్రి రోడ్డుపై నడిచారని.. దంపతులకు రూ.3 వేలు ఫైన్‌.. చివరికి రూ.వెయ్యికి బేరం

Couple ‘fined’ for walking after 11 pm, two Bengaluru policemen suspended. ఫ్రెండ్‌ పుట్టినరోజు వేడుకకు తన భార్యతో కలిసి వెళ్లిన ఓ వ్యక్తి.. తిరిగి రాత్రి 12.30 సమయంలో

By అంజి  Published on  12 Dec 2022 5:24 AM GMT
అర్ధరాత్రి రోడ్డుపై నడిచారని.. దంపతులకు రూ.3 వేలు ఫైన్‌.. చివరికి రూ.వెయ్యికి బేరం

ఫ్రెండ్‌ పుట్టినరోజు వేడుకకు తన భార్యతో కలిసి వెళ్లిన ఓ వ్యక్తి.. తిరిగి రాత్రి 12.30 సమయంలో నడుచుకుంటూ వెళ్తుండగా చేదు అనుభవం ఎదురు అయ్యింది. రాత్రి వేళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన దంపతులకు పోలీసులు షాకిచ్చారు. ఇంటికి చేరువలో ఉన్న ఆ దంపతులను ఇద్దరు పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత రూ.3 వేలు కట్టాలంటూ చలాన్‌ వేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. రాత్రి వేళ దంపతులను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు.

''మేము మా ఇంటి గేట్‌ నుండి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న సమయంలో పింక్ హొయసల పెట్రోలింగ్ వ్యాన్ మా దగ్గర ఆగింది. పోలీసు యూనిఫారంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మా ఐడి కార్డులు చూపించమని అడిగారు. మేము అవాక్కయ్యాం. అదృష్టవశాత్తూ మా వద్ద మా ఆధార్ కార్డ్‌ల ఫోటోలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా వారు మా ఫోన్‌లను తీసుకుని మా సంబంధం, పని చేసే స్థలం, తల్లిదండ్రుల వివరాలు మొదలైనవాటి గురించి మమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభించారు. మేము వారి ప్రశ్నలకు మర్యాదపూర్వకంగా సమాధానమిచ్చాము. ఈ సమయంలో వారిలో ఒకరు చలాన్ బుక్ లాగా ఉన్న దానిని తీసి, మా పేర్లు, ఆధార్ నంబర్లను నమోదు చేయడం ప్రారంభించారు.'' అని బాధిత వ్యక్తి ట్విటర్‌ పోస్టులో పేర్కొన్నాడు.

రాత్రి 11 దాటిన తర్వాత రోడ్డుపై నడవడం తప్పని, రూ.3 వేలు జరిమానా కట్టాలని ఆ జంటకు పోలీసులు చెప్పారు. దీంతో షాకైన ఆ దంపతులు.. తమకు ఈ రూల్‌ తెలియదని, మరోసారి ఇలా చేయం అని బతిమాలుకున్నారు. పోలీసులు మొదట రూ.3,000 జరిమానాగా డిమాండ్ చేశారని, అయితే తర్వాత రూ.1,000 అంగీకరించారని ఆ వ్యక్తి తెలిపారు. మళ్లీ అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళితే వారిపై 'బలమైన' కేసు నమోదు చేస్తామని, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండేలా చూస్తామని పోలీసులు తమకు చెప్పారని ఆ వ్యక్తి తెలిపారు. తమకు ఎదురైన ఈ సంఘటనను సదరు వ్యక్తి బెంగళూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన బెంగళూరు నార్త్‌ ఈస్ట్‌ డీసీపీ అనూప్‌ శెట్టి.. సంపిగహళ్లి పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు.



Next Story