సముద్రంపై పారాసెయిలింగ్ చేయడం అంటే ఓ రకమైన సాహసమే.. ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా.. సముద్రంలో పడిపోతామేమోనన్న భయం ఉంటుంది. గాలిలో ఎగురుతుండగా ఒక్కసారిగా తాడు తెగిపోతే.. పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా మారుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుజరాత్‌లో జరిగింది. అజిత్ కథడ్, సరళాకథడ్ అనే దంపతులు ఆదివారం సెలవు కావడంతో ఎంజాయ్ కోసం దయూలోని సంగావ్ బీచ్‌కు వెళ్లారు. సముద్రంలో పారాసెయిలింగ్ చెద్దామని నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత దంపతులు పవర్ బోటు ఎక్కారు. అక్కడ వారిని నిర్వహకులు పారాచూట్‌తో పైకి ఎగరేశారు.
కొద్దిసేపటి తర్వాత పవర్ బోటుకు, పారాచూట్‌కు మధ్య అనుసంధానంగా ఉన్న తాడు తెగిపోయింది. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా భయాందోళనకరంగా మారింది. బోటులోనే ఉన్న అజిత్ సోదరుడు రాకేశ్ ఒక్కసారిగా భయంతో అరిచాడు. దీంతో బోటు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే నీటిలో దూకి ఆ దంపతులను రక్షించారు. పారాసెయిలింగ్ చేసేముందు వారు లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే వారికి ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.