యువ నేతలకు కీలక బాధ్యతలు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
By Medi Samrat Published on 20 Aug 2023 12:09 PM GMTకాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఖర్గేతో పాటు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, ఎకె ఆంటోనీ, అంబికా సోని, మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్, పి చిదంబరం వంటి సీనియర్ నేతలు ఉన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తారిఖ్ అన్వర్‌తో పాటు ముకుల్ వాస్నిక్, జీ-23 గ్రూపునకు చెందిన ఆనంద్ శర్మ, శశి థరూర్, మనీష్ తివారీలకు కూడా చోటు కల్పించారు. వీరితో పాటు అజయ్ మాకెన్, అశోకరావ్ చవాన్, ప్రియాంక గాంధీ, కుమారి సెల్జా, తామ్రధ్వజ్ సాహు, అభిషేక్ మను సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్, జైరామ్ రమేష్, జితేంద్ర సింగ్, రణదీప్ సూర్జేవాలా, సచిన్ పైలట్‌లకు కూడా చోటు కల్పించారు.
శాశ్వత ఆహ్వానితుల్లో వీరప్ప మొయిలీ, హరీష్ రావత్, పవన్ కుమార్ బన్సల్, మోహన్ ప్రకాష్, రమేష్ చెన్నింతల, బీకే హరిప్రసాద్, ప్రతిభా సింగ్, మనీష్ తివారి, దీపేంద్ర హుడా, కే రాజు, మీనాక్షి నటరాజన్, సుదీప్ రాయ్ బర్మన్ మరియు పలువురు నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గతంలో సోనియా గాంధీ ఏర్పాటు చేసిన పాలక కమిటీతో కలిసి పనిచేస్తున్నారు.
అయితే.. ఇప్పుడు ప్రకటించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో గత కమిటీతో పోల్చితే పెద్దగా మార్పులు చేయలేదు. ప్రత్యేక ఆహ్వానితుల పేర్లలో పల్లం రాజు, పవన్ ఖేడా, గణేష్ గోడియాల్, యశోమతి ఠాకూర్, సుప్రియా శ్రీనెట్, పరిణీతి షిండే, అల్కా లాంబా తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన వర్కింగ్ కమిటీలో యువత, అనుభవం కలగలిసి కనిపిస్తున్నారు. పార్టీ కార్యవర్గంలో అనుభవం ఉన్న నేతలకు స్థానం కల్పించగా.. పలువురు యువనేతలను కూడా ఇందులో చేర్చుకున్నారు. కార్యవర్గంలోకి వచ్చిన యువనేతల్లో సచిన్ పైలట్, గౌరవ్ గొగోయ్, సుప్రియా శ్రీనెట్, కన్హయ్య కుమార్, దీపేందర్ హుడా, మీనాక్షి నటరాజన్, పరిణీతి షిండే, సచిన్ రావు, అల్కా లాంబా, వంశీచంద్‌రెడ్డి వంటి నేతల పేర్లు ఉన్నాయి.
తనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి తీసుకున్నందుకు పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ నేత శశిథరూర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని అందరినీ కలుపుకొని పోవాలనుకునే అనేకమంది భారతీయులు మన నుండి మంచిని ఆశిస్తున్నారని శశి థరూర్ అన్నారు. శశిథరూర్ మాట్లాడుతూ.. 'చరిత్రలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గత 138 ఏళ్లుగా పార్టీని నడిపించింది. నేను కూడా అందులో భాగమైనందున నేను చాలా గౌరవించబడ్డాను. పూర్తి అంకిత భావంతో పార్టీకి సేవ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు.