కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త, గ్రామ పంచాయతీ సభ్యుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బ్యానర్ విషయంలో జరిగిన వివాదం నేపథ్యంలో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కల్మాదేశ్వర మఠం రోడ్డు సమీపంలో బాధితుడు గణేష్ గౌడ (38) పై పదునైన ఆయుధంతో దాడి చేశారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలోని ఒక బార్ దగ్గర రెండు గ్రూపుల సభ్యులు గతంలో గొడవ పడ్డారు. ఆ తర్వాత ఘర్షణ మరింత పెరిగింది. రెండు గ్రూపుల్లో ఉన్న అనేక మంది తలలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చిక్కమగళూరు జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్ బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించిందని, దాడి చేసిన వారిని పట్టుకోవడానికి నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ అమాతే తెలిపారు. ఘర్షణలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. "ఈ సంఘటన వెనుక గల కారణాలను తెలుసుకోడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఫిర్యాదు, దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటాము" అని విక్రమ్ అమాతే అన్నారు. సఖరాయపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనకు సంబంధించి వివరాలు కోరినట్లు మీడియా నివేదించింది. సీఎం హత్యను ఖండిస్తూ, గణేష్ గౌడ మరణం తనను బాధించిందని తెలిపారు. నేరస్థులకు చట్టం ప్రకారం గరిష్ట శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చారు.