హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. సీఎం రాజీనామా
Congress won the Himachal Pradesh assembly elections. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 సీట్లకు
By అంజి Published on 8 Dec 2022 5:32 PM ISTహిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ 35ను దాటేసింది. 39 స్థానాల్లో విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రతి ఐదేళ్లకోసారి తన ప్రభుత్వాన్ని మార్చే ఆచారాన్ని కొనసాగించింది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక పార్టీ 35 సీట్లు సాధించాల్సి ఉండగా, హిమాచల్‌లో బీజేపీ 26 సీట్లు సాధించగలిగింది. అవసరమైన సంఖ్యను సేకరించడంలో విఫలమైనందున, బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం గురువారం పదవీవిరమణ చేయవలసి వచ్చింది.
ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కాగా మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై జైరాం ఠాకూర్ గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి చెందడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఠాకూర్ తన సిరాజ్ స్థానాన్ని గెలుచుకోవడం గమనార్హం. కాగా, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో ఇద్దరు మాజీ బీజేపీ నేతలు కాగా, మరొకరు కాంగ్రెస్ నేత.
కాగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.
''నా రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశాను. ప్రజల అభివృద్ధి కోసం పని చేయడం ఎప్పటికీ ఆపను. మేము కొన్ని విషయాలను విశ్లేషించుకోవాలి. ఫలితాల దిశను మార్చే కొన్ని అంశాలు ఉన్నాయి. అదిష్ఠానం మమ్మల్ని పిలిస్తే నేను ఢిల్లీకి వెళ్తాను.'' అని జైరామ్ ఠాకూర్ చెప్పారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావంతోనే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాహుల్ ప్రభావంతో పాటు ప్రియాంక గాంధీ ప్రచారం, పర్యవేక్షణ, నాయకుల సమిష్టి కృషితో బీజేపీని ఓడించామని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.