దేశంలో మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు: సోనియాగాంధీ
శవ్యాప్తంగా ఉన్న మహిళలు తీవ్ర సంక్షోభం వల్ల గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని సోనియాగాంధీ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 13 May 2024 2:43 PM ISTదేశంలో మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు: సోనియాగాంధీ
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ సోమవారం ఒక వీడియోను విడుదల చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు తీవ్ర సంక్షోభం వల్ల గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని చెప్పారు. తమ మేనిఫెస్టోలో పేర్కొన్న గ్యారెంటీలతో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మహాలక్ష్మి పథకం వల్ల అందరికీ లబ్ధి చేకూరుతుందని సోనియగాంధీ చెప్పారు.
స్వాతంత్ర్య సంగ్రామం నుంచి ఆధునిక భారత నిర్మాణం వరకు మహిళల కృషి మరువలేనిదని సోనియాగాంధీ అన్నారు. కానీ.. ద్రవ్యోల్బణం వల్ల ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళలంతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారి కష్టానికి న్యాయం చేకూరడం లేదన్నారు. అందుకే వారికి న్యాయం అదించేందుకు కాంగ్రెస్ విప్లవాత్మక గ్యారెంటీతో ముందుకు వచ్చిందని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష లభిస్తుందనీ.. తద్వారా మహిళలకు ఆర్థికంగా ఊరటగా ఉంటుందని సోనియాగాంధీ అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్యారెంటీలను అమలు చేస్తున్నాయనీ.. అనేక కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని సోనియాగాంధీ చెప్పారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచారహక్కు చట్టం, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి విప్లవాత్మక చర్యల ద్వారా కోట్లాది మంది భారతీయులకు కాంగ్రెస్ పార్టీ సాధికారత కల్పించిందని సోనియాగాంధీ చెప్పారు. మహాలక్ష్మి ద్వారా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ వీడియో సందేశాన్ని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇదే వీడియోను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ఎక్స్ ఖాతాల్లో పోస్టు చేశారు.