సీఎం స్టాలిన్ కోసం మైసూర్‌పాక్‌ కొన్న రాహుల్‌గాంధీ (వైరల్ వీడియో)

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  13 April 2024 4:32 AM GMT
congress, rahul gandhi,  mysore pak, tamil nadu cm stalin,

 సీఎం స్టాలిన్ కోసం మైసూర్‌పాక్‌ కొన్న రాహుల్‌గాంధీ (వైరల్ వీడియో)

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దాంతో.. ఎక్కడ చూసినా రాజకీయ నాయకులు కనిపిస్తున్నారు. ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ అన్ని వ్యూహాలను సిద్ధం చేసి ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ఎలాగైనా మోదీ సర్కార్‌ను గద్దె దించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పలుమార్లు పాదయాత్ర చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడుకు వెళ్లారు. అక్కడ రాహుల్‌గాంధీ ఓ స్వీట్‌ షాపులోకి వెళ్లి అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతేకాదు.. అక్కడ ఫేమస్ అయిన మైసూర్‌పాక్‌ను తమిళనాడు సీఎం స్టాలిన్ కోసం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇండియా కూటమి ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ తమిళనాడుకు వెళ్లారు. ఈ సందర్భంగా కోయంబత్తూరులో నిర్వహించిన కూటమి మీటింగ్‌కు వెళ్లారు. అయితే.. మీటింగ్‌కు వెళ్తున్న క్రమంలో సింగనల్లూరులోని ఓ స్వీట్‌ షాపులోకి ఆయన వెళ్లారు. దాంతో.. షాపులో ఉన్న సిబ్బందితో పాటు.. ఇతర కస్టమర్లు రాహుల్‌గాంధీని చూసి ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. ఇక రాహుల్‌గాంధీని చూసిన వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ కాసేపు ఉన్న రాహుల్‌గాంధీ వారితో సంభాషించారు. దుకాణాదారుడు, పనిచేసే సిబ్బందితో ముచ్చటించారు. అక్కడ ఏంటి స్పెషల్‌ అని అడగ్గా వారు మైసూర్‌పాక్‌ చాలా బాగుంటుందని చెప్పారు. దాంతో.. రాహుల్‌గాంధీ మైసూర్‌పాక్‌ని కొనుగోలు చేసి ప్యాక్ చేయించారు. ఇక ఆ తర్వాత గులాబ్‌ జామున్ కూడా కొనుగోలు చేసి అక్కడే ఆరగించారు. ఆ తర్వాత అక్కడి వారితో ఫొటోలు దిగారు.

అయితే.. రాహుల్‌గాంధీ పార్శిల్ చేయించిన మైసూర్‌పాక్‌ ఎవరికి కోసమా అని కాంగ్రెస్ నేతలు కొంత ఆలోచనలో పడ్డారు. అయితే.. వెంటనే ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. కూటమి తలపెట్టిన సభ వద్దకు వెళ్లిన రాహల్‌గాంధీ.. ఆ మైసూర్‌పాక్‌ కవర్‌ను తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అందజేశారు. రాహుల్‌గాంధీ స్వయంగా స్వీట్‌ కొనుగోలు చేసి తేవడంతో స్టాలిన్ ఆశ్చర్యపోయి ఆనందం వ్యక్తం చేశారు. స్టాలిన్‌కు రాహుల్‌గాంధీ మైసూర్‌పాక్‌ ప్యాకెట్ కొనుగోలు చేసి.. ఆ తర్వాత అందించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

Next Story