కాంగ్రెస్ పార్టీలో విషాదం.. క‌రోనాతో క‌న్నుమూసిన ఎంపీ

Congress MP Rajiv Satav Passes away.క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది.తాజాగా కాంగ్రెస్ ఎంపీ క‌రోనాతో క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 May 2021 5:53 AM GMT
MP Rajiv Satav

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అనే తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ క‌రోనాతో క‌న్నుమూశారు. మ‌హారాష్ట్ర‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు రాజీవ్ స‌తావ్ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 46 సంవ‌త్స‌రాలు. ఏప్రిల్ 19న రాజీవ్‌ సతావ్‌ కరోనా లక్షణాలను కనిపించాయి. పరీక్షలు చేయడంతో 21న పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన పుణెలోని జహంగీర్‌ హాస్పిటల్‌లో చేరారు.

వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించగా కొంత వరకు కోలుకున్నారు. త‌రువాత మ‌ళ్లీ ఆరోగ్యం క్షీణించ‌డంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈక్ర‌మంలో ఆదివారం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతి చెందారు. ఆయన మృతిపై కాంగ్రెస్‌ పార్టీ, నేతలు సంతాపం ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి జై రామేశ్‌ రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రాజీవ్‌ సతావ్‌ మృతిపై కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా ఆవేదన వ్యక్తం చేశారు. 'ఈ రోజు నేను యూత్‌ కాంగ్రెస్‌లో నాతో ప్రజా జీవితంలో మొదటి అడుగు వేసిన స్నేహితుడిని కోల్పోయాను' అని ట్వీట్‌ చేశారు.

1974 సెప్టెంబ‌ర్ 21న పుణెలో జ‌న్మించిన రాజీవ్ స‌తావ్.. కాంగ్రెస్ పార్టీలో ప‌లు కీల‌క ప‌ద‌వులు నిర్వ‌ర్తించారు. 2014-19 మధ్య హింగోలి లోక్‌స‌భ స్థానం నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన స‌తావ్‌.. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ ఎంపీగా ఉంటూ గుజ‌రాత్ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.


Next Story