క‌రోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే క‌న్నుమూత‌

Congress MLA Kalawati Bhuriya passes away.దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంబిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2021 5:05 AM GMT
క‌రోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే క‌న్నుమూత‌

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంబిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డి కోలుకోగా.. మ‌రి కొంద‌రు మృత్యువాత ప‌డ్డారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పుర్ జిల్లాలోని జోబట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కళావతి భూరియా కరోనా బారిపనపడి కన్నుమూశారు.

కొద్ది రోజుల క్రితం ఆమెకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఏప్రిల్ 15న చికిత్స కోసం ఇండోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే.. ప‌రిస్థితి విష‌మించ‌డంతో నేడు ఆమె క‌న్నుమూశారు. ఎమ్మెల్యే కళావతి కన్నుమూశారని తెలియగానే ఆమె నియోజకవర్గమంతా శోకసంద్రంగా మారిపోయింది. 2018లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంత‌కంటే ముందు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2000 నుంచి 2018 వరకూ ఝాబువా జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా పనిచేశారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 3,46,786 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,10,481 కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,624 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మహ‌మ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,89,544కి చేరింది. నిన్న 2,19,838 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,38,67,997 కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 25,52,940 యాక్టివ్ కేసులున్నాయి.




Next Story