ప్రధాని మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున ఖర్గే

మహారాష్ట్రలోని ముంబైలోని ఇండియా కూటమి నేతలు సమావేశం అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  18 May 2024 5:27 PM IST
congress, mallikarjun kharge, comments,  pm modi,

ప్రధాని మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున ఖర్గే 

మహారాష్ట్రలోని ముంబైలోని ఇండియా కూటమి నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరంపై బుల్డోజర్‌ నడుపుతామని ఆయన ఎలా చెప్తారంటూ నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలనీ.. చర్యలు తీసుకోవాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.

తాము ఇప్పటి వరకు ఎలాంటి బుల్డోజర్లు వాడ లేదు కానీ..ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ఖర్గే ప్రశ్నించారు. బీజేపీ వారే బుల్డోజర్లు వాడుతున్నారని చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లను పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని మోదీపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని మల్లికార్జున ఖర్గే కోరారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగ ప్రకారం అన్నింటికీ రక్షణ కల్పిస్తామనీ.. తాము రాజ్యాంగాన్ని అనుసరిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

మహారాష్ట్రలో నిజమైన పార్టీలకు కాకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్న వర్గాలకు పార్టీ గుర్తులను ఈసీ కేటాయించిందనీ.. ఇది సరికాదని మల్లికార్జున ఖర్గే అన్నారు. ద్రోహం, కుట్రల ఆధారంగా మహారాష్ట్రలో అక్రమంగా మహాయుతి ప్రభుత్వం ఏర్పడిందంటూ విమర్శలు చేశారు. స్వయంగా ప్రదాని మోదీ మద్దతు ఇచ్చారనీ.. ఆయన ఎక్కడికి వెళ్లినా దేశ ప్రజల్లో చీలిక తెచ్చే కుట్ర చేస్తున్నారంటూ మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు.

Next Story