ఏపీతో పాటు బీహార్‌కు ప్రత్యేక హామీని మోదీ నెరవేరుస్తారా? జైరాం రమేశ్
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎన్డీఏ కూటమి, మోదీకి పలు ప్రశ్నలు వేశారు.
By Srikanth Gundamalla Published on 6 Jun 2024 8:45 PM ISTఏపీతో పాటు బీహార్‌కు ప్రత్యేక హామీని మోదీ నెరవేరుస్తారా? జైరాం రమేశ్
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎన్డీఏ కూటమి, మోదీకి పలు ప్రశ్నలు వేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారా అని అడిగారు. ఏపీతో పాటు బీహార్ రాష్ట్రానికి కూడా హోదా ఇస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ రెండు హామీలను అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా నాలుగు ప్రశ్నలు అడుగుతూ పోస్టు పెట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని 2014 ఏప్రిల్ 30న తిరుపతి వేదికగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారని జైరాం రమేశ్ అన్నారు. దాంతో.. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని ప్రజలను నమ్మించారని అన్నారు. ఇప్పటికే పదేళ్లు అవుతోంది.. హోదా ఊసే ఎత్తడం లేదన్నారు. అయితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీడీపీ కీలకం అయిన నేపథ్యంలో ఇప్పుడేం చేస్తారో చెప్పాలని జైరాం రమేశ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అన్ని పార్టీలు వ్యతిరేకించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడా ప్రైవేటీకరణను నిలిపివేస్తారా అంటూ జైరాం రమేశ్ ప్రశ్నించారు.
ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీశ్ కుమార్ కూడా చాఆ కాలంగా బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారని జైరాం రమేశ్ అన్నారు. ఇప్పుడీ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూలతో కొనసాగిన మహాఘట్‌బంధన్ హయాంలో రాష్ట్రంలో కులగణన చేపట్టామన్నారు. దీనిని దేశవ్యాప్తంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నితీశ్ కూడా ఇందుకు మద్దతు తెలుపుతున్నారని... మరి ప్రధాని కులగణన చేస్తారా? అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు.