రామమందిరం ప్రారంభోత్సవానికి గైర్హాజరుపై ఖర్గే క్లారిటీ
బీజేపీ నాయకుల విమర్శలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 6:00 PM ISTరామమందిరం ప్రారంభోత్సవానికి గైర్హాజరుపై ఖర్గే క్లారిటీ
జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. రాముడి విగ్రమ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మేరకు అయోధ్య ట్రస్ట్ ఆహ్వానాలు కూడా పంపింది. అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి అంబేద్కర్, జగ్జీవన్‌రామ్, కాన్షీరామ్ కుటుంబాలతో పాటు రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల కుటుంబాలు, పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
ఇక ఆహ్వానాలు అందుకున్నవారిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి కూడా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానం పంపారు. అయితే.. తాము ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మాజరుకాబోమని కాంగ్రెస్ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు విమర్శలు చేస్తూ వస్తున్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన తర్వాత.. కాంగ్రెస్ నాయకులు తిరస్కరించారు అంటే మత విశ్వాసాలను కించపరుస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల విమర్శలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. త్వరలోనే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయనీ.. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం బీజేపీ కుట్రపూరితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమం బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్‌ఎస్ నిర్వహిస్తోన్న రాజకీయ కార్యక్రమం కాబట్టే తాము హాజరుకావడం లేదన్నారు. అంతేకానీ.. అయోధ్య పర్యటనను తాము బహిష్కరించడం లేదని స్పష్టం చేశారు. జనవరి 22న అయోధ్యలో జరగబోయే కార్యక్రమాన్ని మాత్రమే తాము బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఇందులో మత విశ్వాసాలను కించపర్చే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని చెప్పారు. బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు.