ప్రధాని మోదీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు

ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది.

By Srikanth Gundamalla  Published on  8 April 2024 5:26 PM IST
congress, complaint,  bjp,  election commission of india ,

ప్రధాని మోదీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు 

ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, రాజ్యసభ ఎంపీ ముకల్‌ వాస్నిక్, పవన్‌ ఖేరా, గుర్దీప్‌ సప్పల్‌లతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం మధ్యాహ్నం నిర్వాచన్‌ సదన్‌లో ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను ముస్లిం లీగ్‌తో పోలుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే పార్టీ ఎన్నికల ప్రచారంలో సాయుధ బలగాలను కొనసాగించడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింది అంటూ బీజేపీపై కూడా కాంగ్రెస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఏప్రిల్ 6వ తేదీన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను అబద్దాల మూటగా అభివర్ణించారు ప్రధాని మోదీ. మేనిఫెస్టోలోని ప్రతి పేజీ భారత్‌ను ముక్కలు చేసే ప్రయత్నంగా ఉందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ముస్లిం లీగ్‌ ముద్ర ఉన్న కాంగ్రెస్‌ మేనిఫస్టోలో ఉన్నదంతా వామపక్షాలు స్వాధీనం చేసుకున్నాయంటూ మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలు, విధానాలు లేనవి ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్స్‌పై కాంగ్రెస్‌ సీరియస్‌గా స్పందించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 180 సీట్ల మార్క్‌ను దాటేందుకు బీజేపీ కష్టపడుతోందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేతలు.

Next Story