నిన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు గజిబిజి అనౌన్స్‌మెంట్ కారణమని తెలుస్తోంది. 12వ ప్లాట్‌ఫామ్ నుంచి 16వ ప్లాట్‌ఫామ్‌కు రైలు వస్తుందని అకస్మాత్తుగా ప్రకటించడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. రైళ్ల ఆలస్యం, రద్దు వదంతులతోనూ తోపులాట జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. రైల్వే నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వస్తున్నాయి.
కాగా తొక్కిసలాటలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ఉందో.. ప్రజల బాధ్యతారాహిత్యం కూడా అంతే ఉందని తెలుస్తోంది. టికెట్లు తీసుకోని వారు పెద్ద సంఖ్యలో లోపలికి చొచ్చుకు రావడం, క్యూ పాటించకపోవడమూ ప్రమాదానికి దారి తీశాయని సమాచారం. మహాకుంభ మేళాకు విపరీతమైన రద్దీ ఉంటుందని తెలిసీ రైల్వే శాఖ తగినన్ని రైళ్లు ఏర్పాటు చేయలేదు. ఉన్న కొద్ది రైళ్లలో వెళ్లాలని ప్రయాణికులు ఆరాటపడటంతో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 18 మంది మరణించినట్టు లోక్‌నాయక్ జయ ప్రకాశ్ ఆస్పత్రి ప్రకటించింది. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. కుంభమేళాకు వెళ్లే భక్తులతో స్టేషన్ కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.