కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సామాన్యలు, సెలబ్రెటీలు అన్న తేడాలేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. తాజాగా ఆ బాటలో మరో రాష్ట్రం కూడా చేరింది. బిహార్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో బిహార్ రాష్ట్రాన్ని అష్ట దిగ్భంధనం చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు.
లాక్‌డౌన్ విధించాలని లేదంటే.. తామే రంగంలోకి దిగుతామని సోమవారం హైకోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులు, అధికారులతో చర్చించిన అనంతరం మే 15 వరకు లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు సీఎం నితీశ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన సవివరమైన మార్గదర్శకాలు, ఇతర కార్యకలాపాలను రూపొందించాలని క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూపును మంగళవారం ఆదేశించినట్లు తెలిపారు. ఇక బిహార్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,407 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 82 మంది మరణించారు. మొత్తం కేసులు 5.09లక్షలను చేరగా.. 2,800 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.