ప్ర‌ధాని మోదీపై పోటీ చేయాల‌నుకున్న క‌మెడీయ‌న్‌ నామినేషన్ తిరస్కరణ

వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల‌ని భావించిన‌ హాస్యనటుడు శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది.

By Medi Samrat  Published on  16 May 2024 8:12 AM IST
ప్ర‌ధాని మోదీపై పోటీ చేయాల‌నుకున్న క‌మెడీయ‌న్‌ నామినేషన్ తిరస్కరణ

వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల‌ని భావించిన‌ హాస్యనటుడు శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. శ్యామ్ రంగీలా ప్రధాని నరేంద్ర మోదీని అనుకరించడం ద్వారా ఖ్యాతిని పొందాడు. అత‌డు ఈ నెల మొదట్లో వారణాసిలో ప్రధాని మోదీపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. మే 14న నామినేషన్ దాఖలు చేసిన వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 29 ఏళ్ల శ్యామ్ రంగీలా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు.

నామినేషన్ వేసిన‌ ఒక రోజు తర్వాత శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరించబడినట్లు భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ చూపింది. నామినేషన్ దాఖలు చేయడంలో అడ్డంకులు ఉన్నాయని గ‌తంలో ఆయ‌న‌ ఆరోపించాడు. "ప్రపోజర్లు ఉన్నారు.. ఫారం కూడా నింపబడింది.. కానీ ఎవరూ దానిని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. మేము రేపు మళ్లీ ప్రయత్నిస్తాము" అని శ్యామ్ రంగీలా మే 13న ట్వీట్ చేశాడు.

మరుసటి రోజు మే 14న తన కాల్‌లకు అధికారులు స్పందించడం లేదని.. తన నామినేషన్ దాఖలు చేయలేకపోయాన‌ని పేర్కొన్నాడు. కొన్ని గంటల తరువాత నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయగలిగానని ధృవీకరించాడు. అయితే ఆయన నామినేషన్‌ను పోల్ ప్యానెల్ తిరస్కరించింది. దీంతో 'ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది' అంటూ శ్యామ్ రంగీలా ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఎన్నికల సంఘం ఈ ఎన్నికల పోటీని గేమ్‌గా మార్చింది. ఈరోజు నా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఒకవేళ నా నామినేషన్‌ను స్వీకరించకూడదనుకుంటే.. ప్రజల ముందు ఎందుకు చట్టం చేశారో.. ప్రజలకు స్పష్టం చేయండి అంటూ త‌న గోడును వెలిబుచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గానికి జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.

Next Story