మరో 15 రోజుల్లో లాక్ డౌన్ పెడతామని అంటున్న ముఖ్యమంత్రి
CM Uddhav Thackeray gives Maharashtra 10-15 days before lockdown decision. మహారాష్ట్ర వ్యాప్త లాక్‌డౌన్‌పై ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు
By Medi Samrat
కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల పాటూ లాక్ డౌన్ ను అమలు చేశాయి ప్రభుత్వాలు. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చాయి. ఇలాంటి సమయంలో ప్రజలు కనీసం బాధ్యతగా ప్రవర్తించడం లేదు. మాస్క్ లు వేయడం కూడా మరచిపోయారు. సామాజిక దూరం అంటే ఏమిటో కూడా తెలియనట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే కొన్ని రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో కరోనా కేసులు మరింత ఎక్కువవుతూ ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతానికి కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతూ ఉన్నాయి.
కేసులు పెరుగుతుండడంతో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్ జిల్లాలలో వారం రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. నేటి రాత్రి నుంచి మార్చి 1 వరకు ఇది అమల్లో ఉంటుంది. నేటి నుంచి పూణె, నాసిక్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. శుక్రవారం నాడు పరిస్థితిని సమీక్షించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు. విద్యాసంస్థలను కూడా ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. గత రెండు వారాల్లో కేసులు 2,500 నుంచి ఏడు వేలకు పెరిగాయి.
పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్ర వ్యాప్త లాక్‌డౌన్‌పై ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్‌డౌన్ వద్దనుకుంటే కనుక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని సీఎం హితవు పలికారు. రానున్న 8-15 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇలానే పెరిగితే... ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. మారో సారి లాక్‌డౌన్ విధించాలని మీరు కోరుకుంటున్నారా. మీరు ఇంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. లాక్‌డౌన్ తప్పదు అని థాకరే చెప్పుకొచ్చారు. వద్దనుకున్నవారు మాస్క్ ధరించండి.. లాక్‌డౌన్ కావాలి అనుకునే వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ వల్ల అందరు ఇబ్బంది పడతారనే విషయం గుర్తించాలని కటవుగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందా లేదా అన్న విషయం త్వరలోనే తెలుస్తుంది. ఇప్పటికే అమరావతి, అకోలా వంటి ప్రాంతాల్లో పరిస్థితి చేయి దాటి పోయింది. దాంతో అక్కడ లాక్‌డౌన్ విధించామని అన్నారు.