తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఈరోజు(గురువారం) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
స్టాలిన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అబ్జర్వేషన్‌లో ఉంచామని అళ్వార్ పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా లక్షణాలతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించింది. అయితే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు.
మంగళవారం అలసట, జ్వరంగా అనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి ప్రజలను కోరారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆ రాష్ట్రంలో పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి బుధవారం స్టాలిన్ కు ఓ లేఖ రాశారు. అందులో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్టాలిన్ త్వరగా కోలుకోవాలని, ప్రజల కోసం ఆయన చేస్తున్న కృషిని కొనసాగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ట్వీట్ చేశారు.