దారులన్నీ నాందేడ్ వైపే.. సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఇదే
CM KCR to hold BRS public meeting in Nanded Today.మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రం గులాబీమయమైంది
By తోట వంశీ కుమార్ Published on 5 Feb 2023 2:54 AM GMTదేశ రాజకీయాల్లో సత్తా చాటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన దైన ముద్ర వేసేందుకు భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వేగంగా అడుగులు వేస్తోంది. జనవరి 18న ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభ విజయవంతం కావడం ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహానిచ్చింది. అదే ఊపులో నేడు(ఫిబ్రవరి 5 ఆదివారం) మహారాష్ట్రలోని నాందేద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ బహిరంగ సభ వేదికపైనే పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్‌లో సభా వేదికను సిద్దం చేశారు. దాదాపు 25 వేల మంది కూర్చోనేలా టెంట్లు ఏర్పాట్లు చేశారు. నాందేడ్‌లో సభా వేదిక వద్దకు వెళ్లే రహదారులు దారిపోడవునా గులాబీ తోరణాలు, కేసీఆర్ చిత్రపటాలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ఈ సభలో సీఎం కేసీఆర్ ఏ విషయాలపై ప్రసంగించనున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఇదే..
- ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 12.30 గంటలకు నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి సభా వేదిక సమీపంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడ శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.
- ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి చారిత్రక గురుద్వారాను సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
- సభాస్థలికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటారు. మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు.
- అనంతరం బీఆర్‌ఎస్ నాందేడ్ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
- 2.30 గంటలకు సభాస్థలి నుంచి స్థానిక సిటీ ప్రైడ్ హోటల్‌కు వెలుతారు. భోజనానంతరం 4 గంటలకు జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
- సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.