ఎన్నికల్లో నాయకులు కాదు.. ప్రజలు గెలవాలి: సీఎం కేసీఆర్

దేశం మారాల్సిన సమయం వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆలోచన తీరు మార్చుకోవాలన్నారు. లేదంటే

By Srikanth Gundamalla  Published on  15 Jun 2023 7:25 PM IST
CM KCR, BRS Party, Maharashtra, Nagpur, Elections

ఎన్నికల్లో నాయకులు కాదు.. ప్రజలు గెలవాలి: సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మరోసారి ఫోకస్‌ పెట్టారు. ఈ మధ్య కాలంలో కాస్త బ్రేక్‌ ఇచ్చినట్లు కనిపించారు. కానీ.. మరోసారి జాతీయ రాజకీయాలపై తనదైన శైలిలో మాట్లాడారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్‌ పార్టీని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని జాతీయ రాజకీయాలను ఉద్దేశించి ప్రసంగించారు కేసీఆర్.

దేశం మారాల్సిన సమయం వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆలోచన తీరు మార్చుకోవాలన్నారు. లేదంటే ఎన్నికలు వచ్చినా ఎలాంటి ఉపయం ఉండదని.. ఎలాంటి మార్పు రాబోదన్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. జనాభా విషయంలో భారత్‌ చైనాను దాటేసిందనీ.. లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తుందో అని భయంగా ఉందన్నారు. దేశంలో ఉన్న జాతీయ పార్టీ నేతలు ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల రాజకీయ తంత్రంలో భారత దేశం చిక్కుకుపోయిందన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు.. నాయకులు కాదు.. ప్రజలు గెలవాలని చెప్పారు కేసీఆర్. ఎన్నికల్లో జనాలు గెలిస్తే మాత్రమే సమాజాని మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీరు అందడం లేదన్నారు సీఎం కేసీఆర్. దేశంలోనే మహారాష్ట్ర నెంబర్‌ వన్‌ స్టేట్‌ కానీ.. ఇక్కడున్న ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒక సారి నీళ్లు రావడం దురదృష్టకరమని చెప్పారు. ఔరంగాబాద్‌లోనే కాదు.. మహారాష్ట్రలో ఉన్న చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో తాగు నీరు లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని కేసీఆర్ గుర్తు చేశారు. అక్కడ నీటి సమస్యే కాదు.. విద్యుత్‌ కొరత కూడా ప్రజలను వెంటాడుతుందన్నారు. దేశంలో నీళ్లు, సాగు భూమి సమృద్ధిగా ఉన్నాయని.. తలుచుకుంటే చాలా దేశాలకు అన్నం పెట్టొచ్చని చెప్పారు. జల విధానం మారితేనే ఇది సాధ్యపడుతుందని చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణ రైతులకు అండగా నిలబడ్డామని.. అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.

Next Story