నగదు దొంగతనం చేసిందనే అనుమానంతో హాస్టల్ సూపరింటెండెంట్ 5వ తరగతి బాలిక మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించింది. ఈ ఘటన గత వారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామ్‌జీపురా గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో చోటుచేసుకుంది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు బాలిక కుటుంబ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ అమన్‌వీర్ సింగ్ బైన్స్ కార్యాలయానికి వెళ్లారు.
బాలిక తండ్రి ఫిర్యాదును విన్న కలెక్టర్ దాని ఆధారంగా విచారణకు ఆదేశించినట్లు, హాస్టల్ మహిళా సూపరింటెండెంట్‌ను ఆ పదవి నుంచి తొలగించినట్లు గిరిజన వ్యవహారాల శాఖ అధికారి ఒకరు తెలిపారు.
దీనిపై బాలిక తండ్రి మాట్లాడుతూ.. ఓ అమ్మాయి వద్ద ఉన్న రూ.400 నగదు దొంగిలించిందనే ఆరోపణతో వార్డెన్ తన కుమారైను దెయ్యంగా కనిపించేందుకు మేకప్ వేయించింది. అనంతరం చెప్పుల దండ మెడలో వేసి హస్టల్ క్యాంపస్‌లో ఊరేగించిందని తన కుమారైను కలవడానికి వెళ్లినప్పుడు చెప్పినట్లు అతడు విలేకరులతో చెప్పాడు. తన కుమారై హాస్టల్‌లో ఉండేందుకు ఇష్టపడడం లేదన్నాడు.
విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు హాస్టల్ సూపరింటెండెంట్‌ను ఆ పదవి నుంచి తొలగించినట్లు గిరిజన వ్యవహారాల శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిల్పాజైన్ తెలిపారు. విచారణకు ఆదేశించామని, దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైన్ చెప్పారు.