పేపర్ లీక్ కారణంగా జార్ఖండ్ 10వ తరగతి హిందీ, సైన్స్ బోర్డు పరీక్షలు రద్దు చేయబడ్డాయి. పరిస్థితిని సమీక్షించిన తర్వాత జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ (JAC) ఈ నిర్ణయం తీసుకుంది. రద్దును జేఏసీ అధికారి ధృవీకరించారు. హిందీ పరీక్ష తేదీ ఫిబ్రవరి 18, సైన్స్ పేపర్ ఫిబ్రవరి 20న జరగాల్సి ఉంది.
"సోషల్ మీడియా, వార్తాపత్రికల ద్వారా అందిన సమాచారం ఆధారంగా.. ఫిబ్రవరి 18న మొదటి సిట్టింగ్‌లో జరిగిన హిందీ కోర్సుల సబ్జెక్ట్ పరీక్ష, ఫిబ్రవరి 20న మొదటి సిట్టింగ్‌లో జరిగిన సైన్స్ సబ్జెక్ట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంబంధిత ప్రిన్సిపాల్‌లు, సెంటర్ సూపరింటెండెంట్‌లు, సంబంధిత అధికారులకు తెలియజేయబడింది" అని జేఏసీ ఒక పబ్లిక్ నోటీసులో ధృవీకరించింది.
నోటీసు ప్రకారం.. సబ్జెక్టుల పునఃపరీక్షలు తరువాత నిర్వహించబడతాయి. దీనికి సంబంధించిన వివరాలను బోర్డు పంచుకుంటుంది. జేఏసీ ప్రకారం.. రాష్ట్రంలో గట్టి భద్రత మధ్య ఫిబ్రవరి 11న 10వ తరగతి (మెట్రిక్యులేషన్), 12వ తరగతి (ఇంటర్మీడియట్) బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి.
10వ తరగతి, 12వ తరగతి రెండింటికీ.. 7.84 లక్షలకు పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. పరీక్షలు రెండు సిట్టింగ్‌లలో నిర్వహించబడుతున్నాయి.
10వ తరగతి పరీక్షలు మొదటి సిట్టింగ్‌లో (ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు) షెడ్యూల్ చేయబడ్డాయి. మరోవైపు, 12వ తరగతి పరీక్షలు రెండవ సిట్టింగ్‌లో (మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5.15 వరకు) జరుగుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా 1297 కేంద్రాల్లో 4.33 లక్షలకు పైగా విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకానుండగా, 789 కేంద్రాల్లో 3.50 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకానున్నారు.