సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. సిఫార్సు చేసిన సీజేఐ

తన వారసుడు(త‌దుప‌రి సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సీజేఐ డీవై చంద్రచూడ్ సిఫార్సు చేశారు.

By Kalasani Durgapraveen  Published on  17 Oct 2024 5:48 AM GMT
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. సిఫార్సు చేసిన సీజేఐ

తన వారసుడు(త‌దుప‌రి సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సీజేఐ డీవై చంద్రచూడ్ సిఫార్సు చేశారు. సీజేఐ చంద్రచూడ్‌ ప్రభుత్వానికి లేఖ రాసి ఆయన పేరును సిఫారసు చేశారు. సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి. కొద్ది రోజుల క్రితం.. మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం.. తన సిఫార్సులను పంపాలని కోరుతూ పదవీ విరమణ చేయ‌నున్న‌ సీజేఐకి ప్రభుత్వం లేఖ రాసింది. సీజేఐ చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.

జస్టిస్ సంజీవ్ ఖన్నా 6 నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే అవ‌కాశం ఉంది. ఆయ‌న‌ నవంబర్ 11, 2024న CJIగా బాధ్యతలు చేపట్టే అవ‌కాశం ఉంది. వచ్చే ఏడాది మే 13 వరకూ ఆయన సీజేఐ పదవిలో కొనసాగుతారు. గ‌తంలో ఆయ‌న‌ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

జస్టిస్ సంజీవ్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. 1977 సంవత్సరంలో ఆయ‌న‌ తన పాఠశాల విద్యను మోడరన్ స్కూల్ (న్యూ ఢిల్లీ) నుండి పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో పట్టభద్రుల‌య్యారు. ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ లాలో న్యాయశాస్త్రం అభ్యసించారు.

ఆయ‌న‌ తండ్రి జస్టిస్ దేవ్ రాజ్ ఖన్నా.. 1985లో ఢిల్లీ హైకోర్టు నుండి న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఆయ‌న తల్లి సరోజ్ ఖన్నా ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కళాశాలలో హిందీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సంజీవ్ ఖన్నా ఢిల్లీలోని తీస్ హజారీ క్యాంపస్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 24 జూన్ 2005న ఆయ‌న‌ ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి అయ్యారు. 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తదనంతరం జనవరి 18, 2019న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సంజీవ్ ఖన్నా తండ్రితో పాటు ఆయ‌న‌ మామ హన్సరాజ్ ఖన్నా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. సుప్రీంకోర్టులో నాలుగున్నరేళ్ల పదవీకాలంలో 358 బెంచ్‌లలో భాగమై 90కి పైగా కేసుల్లో తీర్పులు ఇచ్చారు.

Next Story