భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ‘చైనా ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ సిస్టమ్’ను ప్రారంభించింది. ఈ ప్రక్రియ మునుపటి ప్రక్రియ కంటే సులభతరం. డైరెక్ట్ గా హాజరవ్వడం కంటే ఆన్ లైన్ లోనే వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఖాతా WeChatలో, డిసెంబర్ 22 నుండి ఆన్‌లైన్ వీసా సేవా వ్యవస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
దరఖాస్తుదారులు https://www.visaforchina.cn/DEL3_EN/qianzhengyewu ని సందర్శించడం ద్వారా ఫారమ్ నింపి, సంబంధిత పేపర్స్ ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన దరఖాస్తుదారులు టూరిస్ట్ (L), బిజినెస్ (M), స్టూడెంట్ (X) వర్క్ (Z) వీసాల కోసం ఫారమ్‌లను పూరించాలి. ఆయా పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు. ఈ నెల ప్రారంభంలో, చైనా నిపుణులకు వ్యాపార వీసాలను వేగవంతం చేయడానికి భారతదేశం చర్యలు తీసుకుంది. గత సంవత్సరం అక్టోబర్‌లో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి నాలుగు సంవత్సరాలుగా జరిగిన సైనిక ఘర్షణకు ముగింపు పలికిన తర్వాత, గత కొన్ని నెలలుగా భారతదేశం- చైనా తమ సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకుని వచ్చేలా చర్యలను ప్రారంభించాయి.