ఈడీ హద్దులు దాటింది..సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
By Knakam Karthik
ఈడీ హద్దులు దాటింది..సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ "అన్ని హద్దులూ మీరుతోందని", సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తోందని వ్యాఖ్యానిస్తూ, అవినీతి ఆరోపణలపై తదుపరి చర్యలను తక్షణమే నిలిపివేయాలని గురువారం ఆదేశించింది. కేసు విచారణను వెకేషన్ తర్వాత చేపడతామని పేర్కొంది.
తమిళనాడులో రూ.1,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ED ఆరోపించింది, మద్యం సరఫరా ఆర్డర్‌లను పొందడానికి డిస్టిలరీలు లెక్కల్లో చూపని నగదు ఇచ్చాయని తెలిపింది. అయితే, 2014–2021 మధ్య కాలంలో వ్యక్తిగత అవుట్‌లెట్ నిర్వాహకులపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ద్వారా ఇప్పటికే 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తమిళనాడు సుప్రీంకోర్టుకు తెలిపింది. టాస్మాక్ పై ED దాడులు కేంద్ర సంస్థ అధికారాలను అతిక్రమించడమేనని, రాజ్యాంగ ఉల్లంఘన అని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ED రాజకీయ ప్రతీకార చర్యకు పాల్పడిందని తమిళనాడు ఆరోపించింది. దాడులు చట్టవిరుద్ధమని పేర్కొంది.
దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, "మీరు వ్యక్తులపై కేసులు నమోదు చేయవచ్చు... కానీ కార్పొరేషన్లపైన ఎలా చేస్తారు? మీ ఈడీ అన్ని హద్దులూ మీరుతోంది!" అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈడీ చర్యలకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 23న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం, రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసులో ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి దర్యాప్తుపై స్టే విధించింది.