బ‌ర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. 15 రోజులు చికెన్ సెంట‌ర్లు బంద్‌

Chicken centers closed for 15 days with Bird flu in Mandsaur.క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌క‌ముందే మ‌రో బ‌ర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. 15 రోజులు చికెన్ సెంట‌ర్లు బంద్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2021 4:36 PM IST
Bird flu

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌క‌ముందే మ‌రో ముప్పు ముంచుకొస్తుంది. నాలుగు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ప్లూ వ్యాప్తి ఆందోళ‌న క‌లిగిస్తోంది. రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వెలుగుచూసిన ఈ వైర‌స్ క్ర‌మంగా ఇత‌ర రాష్ట్రాల‌కు పాకుతోంది. కేర‌ళ‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనూ ఈ వైర‌స్‌ను గుర్తించారు. కేర‌ళ‌లోని కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో అనేక బాతులు, కోళ్లు మృత్యువాత‌ప‌డ్డాయి. వాటి నమూనాల‌ను ప‌రీక్ష‌ల నిమిత్తం భోపాల్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమ‌ల్ డిసీజెస్ కు పంపిచారు. ఇందులో బ‌ర్డ్ ఫ్లూ ఉన్న‌ట్లు తెలింద‌ని అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతాల‌కు ఒక కిలోమీట‌ర్ ప‌రిధిలోని ఉన్న బాతులు, కోళ్లు వంటి 40 వేల ప‌క్షుల‌ను చంపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మౌందార్‌లో బ‌ర్డ్ ప్లూ విజృంభిస్తోంది. బ‌ర్డ్‌ఫ్లూతో వంద‌ల సంఖ్య‌లో కాకులు మృత్యువాత ప‌డ‌టంతో అక్క‌డి అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మంద్‌సౌర్‌లో 15 రోజుల పాటు చికెన్ సెంట‌ర్లు మూసివేయ‌డ‌మే కాక‌.. కోడిగుడ్ల విక్ర‌యాల‌ను నిషేదించారు. ఒక్క మంద్‌సౌర్‌లోనే బ‌ర్డ్‌ఫ్లూ కార‌ణంగా 100 కాకులు చ‌నిపోయాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌ర్డ్‌ఫ్లూ అలర్ట్ జారీ చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇండోర్‌లో కంట్రోల్ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ ప‌టేల్ తెలిపారు. 2020 డిసెంబ‌ర్ 23 నుంచి 2021 జ‌న‌వ‌రి 3 మ‌ధ్య‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇండోర్‌లో 142, మౌంద్సౌర్‌లో 100, అగ‌ర్ మాల్వాలో 112, ఖార్గోన్‌లో 13, సెహోర్ జిల్లాలో తొమ్మిది కాకులు మృత్యువాత ప‌డ్డాయి. కొన్ని వంద‌ల సంఖ్య‌లో కాకులు మృత్యువాత ప‌డ్డాయి.


Next Story