చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ : 22 మంది జవాన్ల మృతి

Chhattisgarh Maoist attack: 22 jawans killed. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌ ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య పెరుగుతోంది.

By Medi Samrat  Published on  4 April 2021 9:55 AM GMT
Maoist attack

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌ ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 22 మంది మరణించగా.. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుక్మా -బీజాపూర్‌ సరిహద్దుల్లోని దండకారణ్యంలో భద్రతా దళాలు- మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్న సంగతి విదితమే.

ఈ ఘటనలో తొలుత ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, 18 మంది జవాన్ల జాడ కానరాలేదని తొలుత పేర్కొన్న పోలీసులు.. ఆదివారం 17 మంది మృత దేహాలను గుర్తించారు. మరో జవాను ఆచూకీ ఇంకా తెలియరాలేదని సమాచారం. గాయపడ్డ 24 మంది జవాన్లను బీజాపూర్‌ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం రాయ్పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో సిఆర్‌పిఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌ సింగ్‌ చత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబ సభ్యులకు రాష్ట్ర‌పతి రామ్ నాథ్ కోవింద్ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోలేమన్నారు.

హోంశాఖ మంత్రి అమిత్‌ షా మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. శాంతి, పురోగతికి అడ్డుగా నిలుస్తున్న శత్రువులపై పోరాటాన్ని సాగిస్తామంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటన గురించి చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌తో అమిత్‌షా చర్చించారు.


Next Story
Share it