ఫ్రెండ్‌తో గొడవ.. విమానాలకు మైనర్‌ బాలుడు బాంబు బెదిరింపులు.. అరెస్ట్

మూడు విమానాలకు బూటకపు బాంబు బెదిరింపు కాల్‌లు జారీ చేసినందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడిని ముంబై పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

By అంజి  Published on  17 Oct 2024 3:09 AM GMT
Chhattisgarh, boy detained, bomb hoax , flights

విమానాలకు బాంబు బెదిరింపులు.. మైనర్‌ అరెస్ట్

మూడు విమానాలకు బూటకపు బాంబు బెదిరింపు కాల్‌లు జారీ చేసినందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడిని ముంబై పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి వెళ్లే కొన్ని విమానాల్లో బాంబు బెదిరింపులు వచ్చినట్లు తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ పోస్టుల వెనుక ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మైనర్ బాలుడు ఉన్నట్లు విచారణలో తేలింది. తల్లిదండ్రులకు నోటీసులివ్వడంతో బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డుకు అప్పగించారు.

బాలుడికి, అతడి స్నేహితుడికి మధ్య డబ్బు విషయంలో గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆ బాలుడు తన స్నేహితుడి ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులు పెట్టాడు. ఇటీవల కొన్ని విమానాలకు వచ్చిన బూటకపు బాంబు బెదిరింపులకు సంబంధించిన అనేక ఇతర సంఘటనలతో ఈ కేసుకు సంబంధం ఉందా అని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత మూడు రోజుల్లో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్న దాదాపు డజను భారతీయ విమానాలకు బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి .

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ, తాను పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నానని, ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా అవసరమైన ప్రతి చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇస్తున్నట్లు చెప్పారు. "ముంబయి పోలీసులు మూడు విమానాలను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు జారీ చేసినందుకు బాధ్యుడైన ఒక మైనర్‌ని అరెస్టు చేశారు. అంతరాయాలకు కారణమైన మిగతా వారందరినీ గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు" అని ఆయన చెప్పారు.

Next Story