ఛత్రపతి శివాజీ మహరాజ్‌ రైల్వే స్టేషన్‌కు గోల్డ్‌ సర్టిఫికేషన్.. అంత ప్రత్యేకత ఎందుకు..?

Mumbai's CSMT becomes first railway station to get IGBC Gold Certification. దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడంతో రైల్వే శాఖ కీలక

By Medi Samrat  Published on  5 March 2021 5:38 AM GMT
ఛత్రపతి శివాజీ మహరాజ్‌ రైల్వే స్టేషన్‌కు గోల్డ్‌ సర్టిఫికేషన్.. అంత ప్రత్యేకత ఎందుకు..?

దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడంతో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలోనే రైల్వే వ్యవస్థ ఎంతో పెద్దది. అయితే దేశంలో ఒక్కో రైల్వే స్టేషన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. సెంట్రల్‌ రైల్వే ఆధ్వర్యంలో నడిచే రైల్వే స్టేషన్‌.. అత్యాధునిక హంగులతో పాటు పర్యావరణానికి మేలు చేసేలా, ప్రయాణికులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తోంది. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇండస్ట్రీ ఇచ్చిన రేటింగ్స్‌ ప్రకారం మహారాష్ట్రలో గోల్డ్‌ సర్టిఫికేషన్‌ పొందిన మొదటి రైల్వే స్టేషన్‌గా స్థానం దక్కించుకుంది. ఈ స్టేషన్‌కు ఎన్నో ప్రత్యేకతలు లేకపోలేదు. ప్రయాణికులకు సరైన సదుపాయాలు కల్పించడంలో ఈ స్టేషన్‌ ముందుంది. ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించడం వల్లనే ఈ స్టేషన్‌ గోల్డ్‌ సర్టిఫికేషన్‌ పొందగలిగింది.

ప్రత్యేకతలు ఏమిటంటే..

ఈ ఛత్రిపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌లో వాహనాల పార్కింగ్‌ ప్రదేశంలో ఛార్జింగ్‌ పాయింట్లను సైతం ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతోంది. మొత్తం స్టేషన్లో 15 శాతం చెట్లు, చిన్న చిన్న పార్కులు సైతం ఏర్పాటు చేశారు. అయితే వీటన్నింటిని ఆర్గానిక్‌ పద్దతుల్లో పెంచుతున్నారు. ఈ స్టేషన్‌లో మొత్తం 100 శాతం ఎల్‌ఈడీలను అమర్చారు. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం ఈ స్టేషన్‌కు ఉన్న ప్రత్యేకత. అంతేకాదు.. ప్రతి చోట బీఎల్‌డీసీ, హెచ్‌వీఎల్‌ఎస్‌ ఫ్యాన్స్‌ను అమర్చారు. అలాగే స్టేషన్‌లో ఉన్న వివిధ కార్యాలయాలు, వెయింటింగ్ హాళ్లలో ఎక్కవగా సెన్సార్లు ఉపయోగించారు. ఎలివేటర్లు, ప్లాట్‌ఫామ్‌లు, స్టేషన్ ఏరియా, ట్రాక్స్‌ రూఫ్‌టాప్‌లు, పార్కింగ్‌ ప్రాంతం, షట్టర్స్‌, వెయింటింగ్‌ హాళ్లలో ఇలా ప్రతి ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు మెషీన్లు ఉన్నాయి. స్టేషన్‌లో శుభ్రం చేయడానికి బయో డీగ్రేడబుల్‌, ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్‌ మాత్రమే ఉపయోగిస్తారు.

అంతేకాకుండా ఈ స్టేషన్‌లో మొత్తం 245 కిలోవాట్ల సోలార్‌ ప్యానల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. వైఫై, పర్యాటక సమాచారం, అటోమేటివ్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్లు, ఫార్మసీ, వైద్య సదుపాయం, ఆహారం ఇలా ఎన్నో రకాల సదుపాయాలు కల్పించారు. అలాగే పర్యావరణానికి హానీ చేసే ప్లాస్టిక్‌ బ్యాగులను వినియోగించవద్దని రైల్వే స్టేషన్‌లలో ప్రకటనలు కనిపిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలున్నందున ఈ స్టేషన్‌కు ఎంతో పేరొచ్చింది.


Next Story