మొబైల్ స్నాచర్లను ఎదిరించే క్రమంలో రైలు కిందపడి మహిళ మృతి
చెన్నైలో తన మొబైల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు దాడి చేయడంతో రైలు నుంచి పడి ఓ మహిళ మృతి చెందింది.
By అంజి Published on 9 July 2023 4:00 AM GMTమొబైల్ స్నాచర్లను ఎదిరించే క్రమంలో రైలు కిందపడి మహిళ మృతి
గత వారం ఆదివారం (జూలై 2) తన మొబైల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులతో వాగ్వాదం చేస్తుండగా ప్రమాదవశాత్తూ చెన్నైలో లోకల్ రైలు నుండి పడి ఒక మహిళ మరణించింది. ఎస్ ప్రీతి కిందపడిపోవడంతో తలకు బలమైన గాయాలు కాగా, ఘటన జరిగినప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే 22 ఏళ్ల యువతి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. చెన్నైలోని ఇందిరా నగర్ స్టేషన్‌లో రైలు ఫుట్‌బోర్డ్‌పై నిలబడి ప్రీతి తన ఫోన్‌లో మాట్లాడుతోంది. ఇద్దరు నిందితులు ఫోన్‌ని లాక్కోవడానికి ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే ఆమె రైలు నుండి ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది. ఇద్దరు ఆమె మొబైల్ ఫోన్‌ను దొంగిలించారని, ఆమెను అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వదిలివేసినట్లు పోలీసులు తెలిపారు.
సైబర్ క్రైమ్ యూనిట్ సహాయంతో పాటు ప్రీతి కాల్ రికార్డ్‌లను ఉపయోగించి పోలీసు అధికారులు ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేయగలిగారు. దీంతో పోలీసులు బీసెంట్ నగర్‌లోని చేపల దుకాణంలో పనిచేసే రాజు అనే వ్యక్తి వద్దకు వెళ్లారు. 2000 రూపాయలకు ఇద్దరు వ్యక్తుల నుంచి ఫోన్‌ను కొనుగోలు చేసినట్లు రాజు విచారణలో వెల్లడించాడు.
ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితులు - మణిమారన్, విఘ్నేష్‌లను పోలీసులు విజయవంతంగా గుర్తించి పట్టుకున్నారు. విచారణలో, ప్రీతి నుండి ఫోన్ దొంగిలించామని ఇద్దరూ అంగీకరించారు. దీనివల్ల ఆమె రైలు నుండి పడిపోయింది. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.