జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం.. ఎమ్మెల్యేల బాహాబాహీ

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

By అంజి  Published on  7 Nov 2024 12:29 PM IST
Jammu Kashmir assembly, Engineer Rashid brother, Article 370 banner, National news

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం.. ఎమ్మెల్యేల బాహాబాహీ

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టికల్‌ 370పై ఎమ్మెల్యే ఖుర్షీద్‌ అహ్మద్‌ సభలో బ్యానర్‌ను ప్రదర్శించగా, ప్రతిపక్ష నేత సునీల్‌ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకుపోయి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అసెంబ్లీ మార్షల్స్‌ ఎమ్మెల్యేలను విడదీశారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపారు. స్పీకర్‌ అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. అటు ఎమ్మెల్యే ఖుర్షీద్‌కు అనుకూలంగా స్పీకర్‌ వ్యవహారిస్తున్నారని బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

2019లో ఆర్టికల్‌ 370, 32ఏను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలని కోరుతూ పీడీపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రానికి స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలని కోరింది. బుధవారం కూడా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధించాలంటూ శాసన సభ తీర్మానం చేసింది. తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించడంతో బుధవారం కూడా అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఈ చర్యను లోయ ఆధారిత పార్టీలు ప్రశంసించగా, ప్రతిపక్ష బిజెపి దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అటు తదుపరి చర్య కోసం తీర్మానాన్ని జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీకి పంపారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆరేళ్ల విరామం తర్వాత తొలిసారిగా సోమవారం ప్రారంభమైన ఐదు రోజుల సెషన్‌లో నేటి సంఘటన జరిగింది.

Next Story