వారికి గుడ్‌న్యూస్..35 ముఖ్యమైన ఔషధాల ధరలను తగ్గించిన కేంద్రం

దీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik
Published on : 3 Aug 2025 5:18 PM IST

National News, National Pharmaceutical Pricing Authority, Ministry of Chemicals and Fertilizers

వారికి గుడ్‌న్యూస్..35 ముఖ్యమైన ఔషధాల ధరలను తగ్గించిన కేంద్రం

దీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 35 రకాల నిత్యావసర మందుల రిటైల్ ధరలను తగ్గిస్తున్నట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, పెయిన్ రిలీఫ్, యాంటీబయాటిక్ వంటి కీలక మందుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

ధరలు తగ్గించిన జాబితాలో ప్రముఖ ఫార్మా కంపెనీలు తయారుచేసే అనేక ముఖ్యమైన మందులు ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తున్న ఏసెక్లోఫెనాక్, పారాసెటమాల్, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ కాంబినేషన్ టాబ్లెట్ ధరను రూ. 13గా ఎన్‌పీపీఏ నిర్ధారించింది. ఇదే ఫార్ములేషన్‌తో క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ విక్రయించే టాబ్లెట్ ధర రూ. 15.01గా నిర్ణయించారు.

గుండె జబ్బులకు వాడే అటోర్‌వాస్టాటిన్ (40 ఎంజీ), క్లోపిడోగ్రెల్ (75 ఎంజీ) కలిగిన టాబ్లెట్ ధరను రూ. 25.61గా ఖరారు చేశారు. వీటితో పాటు విటమిన్ డి లోపానికి వాడే కోలికాల్సిఫెరాల్ చుక్కల మందు, చిన్న పిల్లలకు ఇచ్చే సెఫిక్సిమ్, పారాసెటమాల్ ఓరల్ సస్పెన్షన్, నొప్పి నివారణకు ఉపయోగించే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ (ఒక మిల్లీలీటర్‌కు రూ. 31.77) వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి

కొత్తగా నిర్ణయించిన ధరల జాబితాను రిటైల్ వ్యాపారులు, డీలర్లు తమ దుకాణాల్లో స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఎన్‌పీపీఏ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టడంతో పాటు, డ్రగ్స్ (ధరల నియంత్రణ) ఆర్డర్-2013, నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద చర్యలు తీసుకుంటారు.

Next Story